DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఏఐటీయూసీ పట్టణ 21వ మహాసభ పట్టణ అధ్యక్షులు వైటి భీమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్ నుండి మంగళాంజనేయ స్వామి ఆలయం వరకు కార్మికుల భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే. అజయ్ బాబు మహాసభ జెండాను ఎగురవేసి సభను ప్రారంభించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునియప్ప, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్. కృష్ణయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, పట్టణ కార్యదర్శులు వీరేష్ కల్లుబాయి, బి. వెంకన్న రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునియప్ప మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయ కార్మిక సంఘంగా ఏఐటీయూసీ చరిత్ర గలదన్నారు. శ్రమకు తగిన వేతనం, శ్రమ దోపిడీ లేని సమ సమాజం సాధించడమే లక్ష్యంగా కార్మిక ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలోని కార్మికుల హక్కుల కోసం యూనియన్లు ఏర్పాటు చేసి, సమ్మె హక్కుతో పాటు 44 కార్మిక చట్టాలను సాధించిన ఘన చరిత్ర ఏఐటీయూసీకి ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే హమాలీలు, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా ఏఐటీయూసీ 21వ మహాసభలు ఈ నెల 28, 29 తేదీలలో ఆలూరు పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 28వ తేదీన జరిగే కార్మిక మహా ప్రదర్శనకు ఆదోని నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆదోని పట్టణ ఏఐటీయూసీకి 31 మంది సభ్యులతో కన్వీనింగ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ కన్వీనర్‌గా వైటి. భీమరాజు, కో-కన్వీనర్లుగా ఓబి. నాగరాజు, బి. ఎంకన్నలను ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా ఆటో యూనియన్, మున్సిపల్ సంఘం, అంగన్వాడీ సంఘం, హమాలి కార్మిక సంఘం, మార్కెట్ యార్డ్ హమాలి సంఘం, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తదితర విభాగాల ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి రమేష్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు రంజిత్ గౌడ్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News