DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా శనివారం “మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే”ను విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజి ఏకే రవి కృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో ఈ తనిఖీలు చేపట్టారు. పత్తికొండ సబ్ డివిజన్‌లో తుగ్గలి మండలం రామళ్ళ గ్రామం, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో కడివెళ్ళ గ్రామం, ఆదోని సబ్ డివిజన్‌లో ఆదోని టౌన్, కర్నూలు సబ్ డివిజన్‌లో కర్నూలు మరియు బి.తాండ్రపాడు, టీవీ9 కాలనీలలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు సహా మొత్తం 240 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 2,000 మంది వ్యక్తులను, 400 వాహనాలను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేయించారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ తదితరులు, సిఐలు, ఎస్సైలు, ఈగల్ టీం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News