DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ఓ, డీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్, డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్ల పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, ఉపాధ్యాయులతో పని చేయించుకోవడం, సరైన ధ్రువపత్రాలు లేకుండానే ఆధార్ కార్డుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టడం జరుగుతోందని ఆరోపించారు. అలాగే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పరీక్షల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజుల వివరాల పట్టిక లేకుండానే ర్యాంకుల పేరుతో ప్రచారం చేస్తూ విద్యను వ్యాపార వస్తువుగా మార్చారని మండిపడ్డారు. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ పాఠశాలపై తక్షణమే విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మల్లికార్జున, రంగస్వామి, విరేష్, ప్రవీణ్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News