DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఒక నిర్దిష్ట సామాజిక వర్గంలోని బలమైన గొంతుకలను లక్ష్యంగా చేసుకుని "ఆపరేషన్ అణచివేత" జరుగుతోందా అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. గత నెల రోజులుగా వైసీపీకి చెందిన కాపు నేతలే వరుసగా ఇబ్బందుల్లో పడటం కాకతాళీయం అనిపించడం లేదు. అంబటి రాంబాబు వంటి సీనియర్ నేతను పాత కేసుల పేరుతో జైలుకు పంపడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి లక్కీ డ్రా వంటి చిన్నపాటి అంశాలను భూతద్దంలో చూపి, ఏకంగా రిమాండ్‌కు పంపడం ద్వారా వైసీపీలోని దూకుడున్న నేతలను మానసికంగా దెబ్బతీయాలనే వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం చట్టపరమైన చర్య మాత్రమే కాదు, ప్రత్యర్థి పార్టీలోని సామాజిక వర్గ నేతలకు ఒక గట్టి హెచ్చరిక పంపే ప్రయత్నంలా ఉందనే చర్చ సాగుతోంది. మరోవైపు, బొత్స సత్యనారాయణ వంటి హుందాతనం ఉన్న నేతలపై జరుగుతున్న "బాడీ షేమింగ్" అటాక్స్ రాజకీయ విలువలను దిగజార్చుతున్నాయి. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్ల ద్వారా ఆయన నడవడికను, శారీరక ఆకృతిని వెక్కిరిస్తూ వీడియోలు చేయించడం, వాటిని కూటమి శ్రేణులు వైరల్ చేయడం వెనుక ఒక లోతైన కుట్ర దాగి ఉంది. ఒక నేతను విధానపరంగా ఎదుర్కోలేనప్పుడు, ఆయన వ్యక్తిత్వాన్ని లేదా రూపాన్ని కించపరచడం ద్వారా ప్రజల్లో ఆయనపై ఉన్న గౌరవాన్ని తగ్గించవచ్చనేది ఈ వ్యూహకర్తల ఆలోచన కావొచ్చు. సీనియర్ నేత అని కూడా చూడకుండా జుగుప్సాకరమైన రీతిలో సెటైర్లు వేయడం ద్వారా, సదరు నేత సామాజిక వర్గంలో కూడా ఒక రకమైన ఆత్మన్యూనత భావాన్ని నింపే ప్రయత్నం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే, రాష్ట్రంలో "కాపు" అనే పదానికి పవన్ కళ్యాణ్ మాత్రమే ఏకైక చిరునామాగా ఉండాలనే ఒక అలిఖిత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన కాపు నేతలను కేసులతో భయపెట్టడం లేదా అవమానాలతో మౌనంగా ఉండేలా చేయడం ద్వారా, ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకు మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు చేర్చే ప్రయత్నం సాగుతోంది. ఇందులో భాగంగానే వంగవీటి రాధా వంటి వారిని కూడా వ్యూహాత్మకంగా పక్కన పెట్టారని, ఆయన కేవలం పేరుకే కూటమిలో ఉన్నారే తప్ప ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. వంగవీటి వారసత్వాన్ని అణిచివేసి, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉండాలని డిసైడ్ అయినట్లు ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన నాయకత్వ ఎదుగుదల కంటే, ప్రత్యర్థులను తుడిచిపెట్టి సాగించే ఏకపక్ష రాజకీయ ప్రస్థానంలా కనిపిస్తోంది. చూద్దాం ఈ "కుల తొక్కుడు" ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో..!?
Admin
DNB News