DNB News - ఆంధ్రప్రదేశ్ / : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో జూలై 1 నుండి 4 వరకు కర్నూలు నగరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని స్థానిక సీఆర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు గిడ్డయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జి. వలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం “త్రిబుల్ పీ” విధానం పేరుతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రక్షించాల్సిన ప్రభుత్వం వాటిని కార్పొరేట్లకు అప్పగించే దిశగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తామని చెప్పే ప్రభుత్వం ఆచరణలో మాత్రం కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌టీఏ పేపర్ లీకేజీలపై స్పందించని విద్యాశాఖ మంత్రి, యూనివర్సిటీల హక్కులను దెబ్బతీసే విధానాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. యూజీసీ వంటి సంస్థలను కేంద్రీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తున్నారని, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, జూలై 1 నుండి 4 వరకు జరిగే శిక్షణా తరగతుల్లో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతులకు యూనివర్సిటీల మేధావులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి. సోమన్న, ఎస్. షాబీర్ భాష, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు రంగస్వామి, శరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, శ్రీకాంత్, నగర కార్యదర్శి అశోక్, మహిళా నాయకులు మెస్సి, శ్రీకవ్య, నాయకులు మునీస్వామి, విరాంజి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News