DNB News - ఆంధ్రప్రదేశ్ / : రైతుల భాగస్వామ్యంతో రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని మండలాల్లో జరుగుతున్న రీ సర్వే, పి.జి.ఆర్.ఎస్, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ మరియు రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రీ సర్వే పనులను సమయపాలనతో పాటు నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మొదటి దశలో 9 మండలాల్లో 9 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 13 నోటిఫికేషన్ స్థాయిని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. రెండవ దశలోని 9 గ్రామాల్లో కూడా 13 నోటిఫికేషన్ పూర్తి చేసి తుది దశలో ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు దశల్లో మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. మూడవ దశలో 16 గ్రామాల్లో పనులు ప్రస్తుతం డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ దశలో ఉండగా, వాటిని మే 3వ తేదీ లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. నాలుగవ దశలో 17 గ్రామాల్లో రీ సర్వే పూర్తై వీఆర్వో, విలేజ్ సర్వేయర్ లాగిన్ దశలో ఉందని తెలిపారు. ఐదవ దశలో 15 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ దశ కొనసాగుతోందని, ఈ దశలో రైతుల భాగస్వామ్యాన్ని పెంచి పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాలను 100 శాతం పూర్తి చేసి, మే–జూన్ నెలల్లో రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మార్చి 2027 నాటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పూర్తిచేసి ప్రతి అర్హ రైతుకు పాసుపుస్తకాలు అందించాలన్నారు. అదేవిధంగా ఎఫ్-లైన్, మ్యుటేషన్, ఆర్.ఓ.ఆర్ వంటి రెవెన్యూ సేవల్లో ప్రజలకు సంతృప్తికర సేవలు అందేలా చూడాలని, పి.జి.ఆర్.ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించలేని పరిస్థితిలో స్పష్టమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకతతో రైతులకు న్యాయం జరిగేలా ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాసిల్దార్ శేషఫణి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News