DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా గరుసు తవ్వకాలు చేపట్టిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ గరుసు తవ్వకాలపై సమాచారం అందుకున్న గ్రామపంచాయతీ ప్రతినిధులు, స్థానికులు అక్కడికి చేరుకొని ప్రశ్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మైనింగ్ వేలంపాట దక్కించుకున్న సుధాకర ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉద్యోగులు భరత్, గురుమూర్తి, భాను ప్రసాద్లు మాట్లాడుతూ, తమ కంపెనీకి ప్రభుత్వం ద్వారా మైనింగ్ వేలంపాట దక్కిందని, అయితే గ్రామపంచాయతీ పరిధిలో గరుసు తవ్వకాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ భర్త, టీడీపీ ఆదోని మండల అధ్యక్షుడు శివప్ప అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేయాల్సిన బదులు తీవ్ర ఆగ్రహంతో వ్యవహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా శివప్ప, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుతో ఫోన్‌లో మాట్లాడాలని ఉద్యోగులను కోరగా, ఫోన్ సంభాషణ జరుగుతున్న సమయంలోనే భరత్, గురుమూర్తి, భాను ప్రసాద్‌లపై అత్యంత అనుచితమైన, దుర్భాషలతో విరుచుకుపడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బహిరంగంగా అసభ్య పదజాలం ఉపయోగించిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివాదాన్ని కవర్ చేయడానికి అక్కడికి చేరుకున్న విలేకరులపైనా శివప్ప దురుసుగా ప్రవర్తించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. “మీరు ఎందుకు వచ్చారు? ఈ గొడవలన్నీ మీరే సృష్టించేది” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమైనదని, విలేకరులపై ఈ తరహా వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంయమనం పాటించాలని సూచించినప్పటికీ, శివప్ప తన ప్రవర్తన మార్చుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే వ్యక్తి గతంలో ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్వోపై దుర్భాషలాడిన ఘటనలు కూడా ఉన్నాయని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద ప్రవర్తన కలిగిన వ్యక్తికి టీడీపీ మండల అధ్యక్ష పదవి అప్పగించడంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఈ వ్యవహారంపై టీడీపీ ఉన్నత నాయకత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Admin
DNB News