DNB News - ఆంధ్రప్రదేశ్ / : రక్షించి ఇండియాకు తీసుకురావాలని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు స్పందించి, సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డి సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు 950 కి.మీ. దూరంలోని ఎడారిలో గొర్రెల కాపరిగా అష్టకష్టాలు పడుతున్న జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం బిబి రాజ్ పల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23) ను రక్షించి, స్వదేశానికి తెప్పించాలని, మోసం చేసిన ఎజెంట్ పై చర్యలు తీసుకోవాలని అతని తల్లి రాజవ్వ హైదరాబాద్ ప్రజాభవన్ లొ 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' లో సీఎం ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డి, తగిన చర్యలు తీసుకోవాలని జిఏడి ఎన్నారై విభాగం అధికారులను, జగిత్యాల ఎస్పీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, ఏసీపీ ఉమేందర్, వాలంటీర్ పద్మా రాణి తదితరులు పాల్గొన్నారు. అరవింద్ ఫిబ్రవరి 15న ఒక ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ తాగునీరు, ఆహారం, విద్యుత్, సరైన వసతి సదుపాయాలు లేక తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈమేరకు ఆయన పంపిన వీడియోలు వైరల్ అయ్యాయి. యజమాని బలవంతంగా అతని వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించి, ఇండియా సిమ్ కార్డును కూడా లాక్కున్నాడు. రూ.90 వేలు తీసుకున్న ఎజెంట్, 'ప్యాకింగ్ వర్కర్' ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి, ఎడారిలో గొర్రెల కాపరిగా పని చేయిస్తున్నాడని ఆ వినతిపత్రంలో వివరించారు.
Admin
DNB News