DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ప్రభుత్వ యునాని ఆస్పత్రిలో రోగులకు అందాల్సిన మందులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇన్చార్జి వైద్యురాలు ఏ. ఐషా జాబీన్ పై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంచార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన ఓ వికలాంగుడు మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు కొంతమంది మందులు ఇచ్చి మిగిలినవి ఇన్చార్జి వద్ద తీసుకోవాలని సూచించారని తెలిపారు. అయితే ఇన్చార్జి వైద్యురాలిని సంప్రదించగా “నా కస్టడీలో ఉన్న మందులు ఇవ్వను, ఎవరి వద్ద చూపించుకున్నారో వారివద్దే తీసుకోండి” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆరోపించారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందులు పేదలకు అందకుండా గడువు తీరిపోతున్నప్పటికీ వాటిని ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తాను వికలాంగుడినని చెప్పినా కనీస గౌరవం ఇవ్వలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇలాంటి సమస్యలు అనేకమంది రోగులకు ఎదురవుతున్నాయని, మందులు లేక చాలామంది వెనుదిరుగుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి సంబంధిత అధికారాలు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని, పేదలకు అవసరమైన మందులు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులను కోరారు.
Admin
DNB News