DNB News - ఆంధ్రప్రదేశ్ / : దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలులో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, నిరాడంబరతకు మారుపేరు అయిన దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించారని పేర్కొన్నారు. సమాజం పట్ల అంకితభావంతో పనిచేసి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడులో జన్మించిన సంజీవయ్య విద్య, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఇలాంటి మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు నారాయణ, జావేద్, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ మరియు స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News