DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అదనంగా ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సిపిఎం) పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, నాయకులు వీరేష్, వెంకటేష్, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు కలిసి ఆదోని మున్సిపల్ ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కి, ఎమ్మెల్యే డా. పార్థసారధి కి, మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 17 మండలాల ప్రజలు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, స్త్రీల మరియు చిన్నపిల్లల ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అయితే అక్కడ తగిన వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలు లేకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రభుత్వమే ఉచితంగా సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక పట్టణాభివృద్ధి అంశాలపై వారు పలు కీలక సూచనలు చేశారు. ఆదోని నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పనులను వెంటనే ప్రారంభించి లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. అలాగే కూలడానికి సిద్ధంగా ఉన్న పాత ఫ్లైఓవర్ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టాలని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారిని మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులుగా నియమించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో పెరుగుతున్న నాన్ లేఅవుట్ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Admin
DNB News