DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుత్తి పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ నెల 9వ తేదీ రాత్రి గుత్తి పట్టణంలోని పెట్రోల్ బంక్ సమీప సాయినాథ్ నగర్‌లో ఓ వివాహిత మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అదే రోజు సంతోష్ నగర్‌లో ఓ వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని గొలుసును దోచుకుని పారిపోతుండగా, స్థానికులు స్పందించడంతో నిందితులు మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలను పరిశీలించి, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ఆధారాల సహాయంతో నిందితులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు మానవ్, హరి ప్రకాష్‌లుగా గుర్తించారు. వారిలో మానవ్‌ను బాలాజీ నగర్‌లో అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు గొలుసు ముక్కను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులు ముందుగా బెంగుళూరు నుంచి అనంతపురం చేరుకుని, అక్కడ పల్సర్ మోటార్ సైకిల్‌ను దొంగిలించి కర్నూలులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసు ఛేదనలో సీఐ విక్రమ్ సింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ గోపి, పీసీలు మురళి, సుబ్బారాయుడు తదితరులు కీలక పాత్ర పోషించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
Admin
DNB News