DNB News - ఆంధ్రప్రదేశ్ / : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పేర్కొన్నారు. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు న్యూరోసర్జరీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యూరోసర్జన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. యముడి వేషధారణతో నిర్వహించిన ఈ వినూత్న ర్యాలీ రాజ్ విహార్ సర్కిల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేగం నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. జరిమానా కోసం కాదు, ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనం నడిపే వారు మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు మీద బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అనంతరం న్యూరోసర్జన్ డా. సుమంత్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు అవుతాయని తెలిపారు. తలకు గట్టి దెబ్బ తగిలితే మెదడు, వెన్నెముకపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కొన్ని సందర్భాల్లో శాశ్వత వికలాంగత లేదా మరణం సంభవించే ప్రమాదం ఉందన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించడం, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడం వంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో ఫస్ట్ ఎయిడ్‌పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ కర్నూలు ఏవీపీ డా. ఆదిత్య, మార్కెటింగ్ జీఎం ఆనంద్, న్యూరోసర్జరీ విభాగం వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News