DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి “ఏ.బి.జి. రాంజీ” అనే పేరును ప్రతిపాదించడం గాంధీజీ ఆశయాలకు, దేశ ప్రజల భావోద్వేగాలకు విరుద్ధమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, పట్టణ కార్యదర్శి టి. వీరేష్ తీవ్రంగా ఖండించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ నాయకత్వంలో, మండల కార్యదర్శి కల్లుబాయి రాజు అధ్యక్షతన ఆదోనిలో సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ పేదల జీవనాధారంగా మారిన ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమ పథకాల పేర్లు మార్చే ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. గాంధీజీ పేరుతో ఉన్న పథకాన్ని తొలగించడం అంటే పేదల హక్కులను, గాంధీ ఆశయాలను అవమానించినట్లేనని విమర్శించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది గ్రామీణ కూలీలకు ఉపాధి లభిస్తోందని, పేరు మార్పు వెనుక ప్రజా సంక్షేమాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BKMU వ్యవసాయ కార్మిక సంఘం ఆదోని నియోజకవర్గం అధ్యక్షులు కొత్తూరు గంగన్న, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు యు. లక్ష్మీనారాయణ, కె. రమేష్ కుమార్, రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్, సీపీఐ రెండో సహాయ కార్యదర్శి సత్యనారాయణ, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రీకాంత్ పుష్పరాజ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News