DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా వ్యవహారం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోందని, దీనికి స్థానిక పోలీసుల సహకారం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఆరోపించారు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా యువత, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఆత్మహత్యలకు కూడా దారి తీస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20న డీఎస్పీ భార్గవి 22 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించినా, అరెస్టైన నిందితులను మీడియాకు చూపించలేదని విమర్శించారు. గతంలో జరిగిన దొంగతనాల కేసుల్లోనూ పారదర్శకత లేకపోవడం, పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని తెలిపారు. వినాయక నిమజ్జనం, దేవస్థానం ఘటనలలో సీఐ శ్రీనివాసులు ప్రవర్తనపై నిరసనలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం 22 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పినా, వాస్తవానికి 60 లక్షలకు పైగా డబ్బు ఉందన్న ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అదనంగా, కీలక నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు అధికారపార్టీ నాయకుడు 13 లక్షలు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు స్థానిక పోలీసులు, అధికారపార్టీ నాయకుల అండ ఉందన్న అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు. బెట్టింగ్ వ్యతిరేకంగా అవగాహన కల్పించాల్సిన పోలీసులు, మాఫియాతో చేతులు కలపడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అధికారులను, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్‌ను ప్రక్షాళన చేయాలని జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు. అలాగే నిందితులను కాపాడిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలు, పార్టీలపై ఉందని స్పష్టం చేశారు.
Admin
DNB News