DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ కోతుల బావి శ్రీ ఆంజనేయస్వామి గుడి స్థల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గుడికి అడ్డంగా మున్సిపల్ కమిషనర్ నిర్మించిన నాపరాళ్ల ప్రహరీని ఈ నెల 14న తొలగించేందుకు చేపట్టిన కార్యక్రమం నేపథ్యంలో, ఈ విషయాన్ని వివరించేందుకు వెళ్లిన కోనేరు నాగేంద్ర ప్రసాద్, కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి, బెస్త వీరేష్‌లను సీఐ కంబగిరి రాముడు అక్రమంగా రెండున్నర గంటలపాటు నిర్బంధించారని ఆరోపించారు. కోనేరు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కోతుల బావి స్థలం గుడికి చెందినదని, ఇప్పటికే ఆర్డీవో సమక్షంలో సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారని తెలిపారు. అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్ అక్రమంగా నాపబండల ప్రహరీ నిర్మించారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఐకి వివరించినప్పటికీ, ప్రైవేట్ వ్యక్తుల ఫిర్యాదు ఆధారంగా మాట్లాడారని తెలిపారు. 14వ తేదీన బండలను తొలగించి తీరుతామని చెప్పిన నేపథ్యంలో సీఐ పోలీసులను పిలిచి తమపై బైండోవర్ కేసు నమోదు చేయాలని, బయటకు పంపవద్దని ఆదేశించారని ఆరోపించారు. అనంతరం కోనేరు నాగేంద్ర ప్రసాద్, ఉపేంద్ర రెడ్డి, బెస్త వీరేష్‌లను ఎమ్మిగనూరు తహసిల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ, తమను రెండున్నర గంటలపాటు అక్రమ నిర్బంధంలో ఉంచి, కేసు వివరాలు కూడా తెలియజేయలేదని తెలిపారు. బైండోవర్ కేసుల విషయంలో చట్ట ప్రకారం తహసిల్దార్‌కు కేవలం సిఫారసు లేఖ మాత్రమే పంపాలని, వ్యక్తులను నేరుగా హాజరు పరచడం చట్టవిరుద్ధమని తహసిల్దార్‌కు వివరించినట్లు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న తహసిల్దార్ శ్రీనివాసులు ప్రస్తుతం బైండోవర్ చేయడం లేదని, పూర్తి వివరాలు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి వారిని పంపించినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నాయకుల కుట్ర ఉందని, గుడి స్థలాన్ని కబ్జాలో ఉంచుకునేందుకే అడ్డంకులు సృష్టిస్తున్నారని కోనేరు ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ఈ నెల 14న నిర్వహించే “శ్రీ హనుమ కరసేవ” కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. అలాగే సీఐ కంబగిరి రాముడు తమను అక్రమంగా నిర్బంధించిన వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేకపోతే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని కోనేరు నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
Admin
DNB News