DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని వైపిఆర్ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆదోని మండల సమితి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఆదోని మండల కార్యదర్శి కల్లుబావిరాజు మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతమైన వైపిఆర్ కాలనీలో అనేక సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి నల్లా కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం ఐదు రోజులకు ఒకసారి కేవలం 20 నిమిషాలు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారని, దీంతో కాలనీవాసులు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. వైపిఆర్ కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే ఈ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. సమస్యను పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కొత్తూరు గంగన్న, రైతు సంఘం నాయకుడు చిన్న హనుమంతు, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యుడు షాక్షా వలి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News