DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని ప్రకాష్ నగర్, కల్లుబావి కాలనీల్లో గత 11 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొంతు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన కాలనీవాసులు సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. ఉదయం 9 గంటలకే మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని “నీళ్లు ఇవ్వాలి… మా సమస్య వెంటనే పరిష్కరించాలి” అంటూ నినాదాలు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు నీటి కోసం అవస్థలు పడుతున్నారని, ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కాలనీల్లో త్రాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని మహిళలు మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.
Admin
DNB News