DNB News - ఆంధ్రప్రదేశ్ / : మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షులు వినోద్‌లను యూనివర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేయడం అత్యంత దారుణమని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. ఈ కిడ్నాప్ ఘటన వెనుక మోహన్ బాబు, విష్ణుల పాత్ర ఉందని ఆరోపిస్తూ, వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు నిరసనగా ఈరోజు ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రహదారిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులపై దౌర్జన్యాలకు పాల్పడటం తగదని హెచ్చరించారు. ప్రశ్నించే విద్యార్థి నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని అన్నారు. కిడ్నాప్ చేసిన వారిని వెంటనే విడుదల చేసి, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News