DNB News - తెలంగాణ / : ఎన్నికలు వస్తేనే నాయకులకు ప్రజలు గుర్తుకొస్తారా? పదవుల కోసం పగటి వేషాలు వేస్తూ జనాలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అశ్వారావుపేట మున్సిపల్ పరిధిలో సాగుతున్న 'అభివృద్ధి' నాటకాన్ని చూస్తుంటే సామాన్య ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్నలివి. గత రెండున్నర ఏళ్లుగా అసంపూర్తిగా పడి ఉన్న పనులు, ఎన్నికల నగారా మోగగానే హడావిడిగా రంగులు పూసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.గత రెండున్నర ఏళ్లుగా అశ్వారావుపేట ప్రధాన రహదారులు నరకప్రాయంగా మారాయి. సెంట్రల్ లైటింగ్ పనుల పేరుతో రోడ్లు తవ్వి వదిలేయడంతో వాహనదారులు, పాదచారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎగిసిపడుతున్న దుమ్ము ధూళి కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా పాలకులు పట్టించుకోలేదు.రోడ్లు పూర్తి చేయకుండానే, కేవలం ఓట్ల కోసమే అన్నట్లుగా ఇప్పుడు అసంపూర్తి డివైడర్లకు రంగులు వేయడం, హడావిడిగా పోల్స్ నిలబెట్టడం చూస్తుంటే ప్రజలను ఎంత వెర్రివారిగా చూస్తున్నారో అర్థమవుతోంది. హామీల హోరు.. అమలులో తీరు 'సున్నా'! రాష్ట్రస్థాయిలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, వందల కొద్దీ హామీల పరిస్థితి ఏమైందో అశ్వారావుపేట మున్సిపాలిటీలో జరుగుతున్న తీరే నిదర్శనం. అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయల అభివృద్ధి అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన పనులను కూడా పూర్తి చేయలేని ఈ నాయకులు, ఇప్పుడు మున్సిపల్ పీఠం ఇస్తే అశ్వారావుపేటను ఇంకెన్ని ముక్కలు చేస్తారోనని జనం ఆందోళన చెందుతున్నారు. బడుగుల ఇళ్లు కూల్చి.. రంగులతో ఊరిస్తారా?అభివృద్ధి అంటే కేవలం డివైడర్లకు రంగులు వేయడం కాదు. పేదల కడుపు కొట్టిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు."300 మంది పేదల ఇళ్లను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీస్ పహారాతో దౌర్జన్యంగా నేలమట్టం చేసిన వైనం, రింగ్ రోడ్డులో కార్మికుల షెడ్ల కూల్చివేత.. ఇవన్నీ అధికార పార్టీ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయి."సామాన్యుడికి ప్రధాన కూడలిలో సెంటు భూమి ఉండకూడదనే కుట్రలు చేస్తున్న వారికి ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడుందని విపక్షాలు మరియు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చాప కింద నీరులా ఓటరు తీర్పు!అశ్వారావుపేట ఓటర్లు అమాయకులు కాదు. తమ కష్టాలను పట్టించుకోకుండా, కేవలం ఎన్నికల వేళ రంగుల హంగులతో వంచించాలని చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. "మీ అధికారం, మీ దోపిడీ మాకు తెలుసు.. మీ కల్లబొల్లి మాటలు ఇక సాగవు" అంటూ ప్రజలు అంతర్గతంగా యుద్ధం ప్రకటించారు. రంగులు వేస్తే ఓట్లు పడతాయనుకోవడం అధికార పార్టీ నాయకుల భ్రమ మాత్రమేనని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.
Admin
DNB News