DNB News - తెలంగాణ / : పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లోకి వెళ్లిన పోలీసులు విద్యార్థులపై లాఠీలతో దాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం జరిగిన ఇండియా–న్యూజిలాండ్ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత మైసమ్మగూడలోని ఓ హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులు బయటకు వచ్చి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు రాళ్లు విసిరారని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. ఆగ్రహంతో ఇద్దరు పోలీసులు హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినట్టు సమాచారం. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు చెబుతున్నారు. బాధితుల మాటల్లోకి వెళ్తే, హాస్టల్ సిబ్బంది చెప్పిన విషయాలను నమ్మి పోలీసులు లోపలికి వచ్చి లాఠీలతో తమపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. హాస్టల్‌లోకి వెళ్లి విద్యార్థులను కొట్టిన దృశ్యాలు వీడియో రూపంలో బయటకు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Admin
DNB News