DNB News - తెలంగాణ / ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విత్తన బిల్లు 2025 రైతుల పాలిట మరణ శాసనమని అఖిల భారత కిసాన్ సభజాతీయ అధ్యక్ష, కార్యదర్శులు రాజు క్షీర్సాగర్, రావుల వెంకయ్య లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం రైతాంగ విధానాలను అవలంభిస్తుందని ఈ క్రమంలో వ్యవసాయ రంగాన్ని సైతం కార్పొరేట్ శక్తులు ఆక్రమిస్తున్నాయని వారు తెలిపారు. బుధవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావుల వెంకయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉండే విత్తన బిల్లును, విద్యుత్ బిల్లును తీసుకు వచ్చిందని వీటిని ఏఐకెఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అదే సమయంలో ఇండో యుఎస్ వాణిజ్య ఒప్పందాలను సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. భారతదేశం వ్యవసాయ దిగుమతులను పెంచడంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రావుల వెంకయ్య తెలిపారు. గతంలో విదేశీ వ్యవసాయ దిగుమతులు కేవలం రూ.70వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 3లక్షల కోట్లకు పెరిగాయని వెంకయ్య తెలిపారు. విదేశీ దిగుమతుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడం లేదని -ఆయన తెలిపారు. కనీస మద్దతు ధర కోసం పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వామినాథన్ చెప్పినట్లుగా సి2ప్లస్ 50 శాతాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయినా ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జాతీయ అధ్యక్షులు రాజు క్షీర్సాగర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ -వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని దీనిని నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని ఆయన తెలిపారు. -జనవరి మూడు, నాలుగు తేదీలలో నాగపూర్లో జరిగిన జాతీయ సమితి సమావేశాల్లో రైతాంగ సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ పరిరక్షణకు బహుముఖ ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్లు క్షీర్సాగర్ తెలిపారు. మోన్స్ శాంటో, బోల్ గార్డ్ తదితర విత్తన సంస్థలు -రైతులను మోసం చేస్తున్నాయని అయినా మోడీ ప్రభుత్వం విత్తన సంస్థలకు మద్దతుగా నిలుస్తుందన్నారు. సిసిఐ, నాఫెడ్ లాంటి సంస్థలను -రంగంలోకి దింపి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. రైతు రుణ విముక్తి చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నామని -తెలిపారు. ఆరావళి పర్వతాలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తున్నామన్నారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో జరిగే రైతాంగ ఉద్యమాలను చేపట్టనున్నామని ఆయన తెలిపారు. నాలుగు లేబర్కోడ్స్కు వ్యతిరేకంగా జరిగే బంద్కు ఏఐకెఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, సీనియర్ నాయకులు అడపా రామకోటయ్య, రైతు సంఘం బాధ్యులు మిడికంటి వెంకటరెడ్డి, కూచిపూడి రవి, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News