DNB News - తెలంగాణ / : జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్- హెచ్ 2843) ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమవుతోందని వెల్లడించారు. ఖమ్మంలోని మంచికంటి ఫంక్షన్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇండ్ల స్థలాల సాధన కోసం దశల వారీ పోరాటాలు చేపడుతామని తెలిపారు. తొలుత సంతకాల సేకరణతో కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతామని అన్నారు. ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలు, కలెక్టరేట్ ముట్టడి, అంతిమంగా ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతామని వెల్లడించారు. అలాగే అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, స్కూల్, కళాశాలల ఫీజుల్లో రాయితీ... తదితరాంశాలపై కూడా సమావేశం చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డులు అత్యవసర పరిస్థితుల్లో ఏరకంగానూ జర్నలిస్టులకు ఉపయోగపడటం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు సైతం హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల విషయంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక కార్డులు ఇస్తున్నామని ప్రకటిస్తూనే... మరోవైపు నిబంధనల పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని తెలిపారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల కార్డులు ఉంటే వాటిని 44 వేలకు పెంచుతున్నట్లు ప్రకటిస్తూ... అర్హతలు, నిబంధనల పేరుతో కోత విధించే చర్యలు ఏమాత్రం సహించరానివని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో కొనసాగుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కొనసాగే నిరసన కార్యక్రమాలు అన్నింటికీ జర్నలిస్టులు జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ఇండ్ల స్థలాల కోసం ఇటీవల 14 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేసిన సంఘం సభ్యుడు కొరకొప్పుల రాంబాబును జిల్లా కమిటీ సన్మానించింది. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవి కిరణ్, టీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ బాలకృష్ణ, నలుబోల మధుశ్రీ, జిల్లా సహాయ కార్యదర్శులు కూరాకుల గోపి, జక్కంపూడి కృష్ణ, కెమెరామెన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గణేష్, ఖమ్మం నియోజకవర్గ అధ్యక్షులు తురగ మూర్తి, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు DNB NEWS chairman దగ్గుబాటి మాధవరావు, నూకల రామచంద్రమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు షేక్ జానీ పాషా, కొత్త యాకేష్, మోహన్ రావు, బంకా వెంకటేశ్వర్లు, కె అచ్చిరెడ్డి, గంగాధర్ DNB NEWS director నాగార్జున బ్రహ్మం DNB NEWS incharge చిర్రా పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News