DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ మోసానికి పాల్పడిన నలుగురు ప్రధాన నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు . అరెస్టైన వారిలో మొహమ్మద్ సయీదుద్దీన్ అలియాస్ ఫరీద్ (26), మొహమ్మద్ తాజుద్దీన్ (31), మొహమ్మద్ యూనిస్ అలియాస్ అర్బాజ్ (25), ఎం.డి. అయ్యూబ్ (24) ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లోని చార్మినార్ జోన్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. నిందితులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లపై సిమ్ కార్డులు తీసుకుని వాటిని ఆన్‌లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ మోసాలకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తికి 2025లో వాట్సాప్ సందేశాలు, కాల్స్ ద్వారా “BETINEXCHANGE” పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌లో పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు ప్రలోభ పెట్టారు. క్రికెట్ బెట్టింగ్, టీన్ పట్టీ, కాసినో గేమ్స్ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. మొదట రూ.20,001 పెట్టుబడి పెట్టగా రూ.5,000 లాభం ఇచ్చి నమ్మకం కలిగించారు. తర్వాత పలుమార్లు బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీలు, క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా డబ్బులు జమ చేయించారు. 2025 నుంచి 2026 జనవరి వరకు బాధితుడు తనతో పాటు భార్య ఖాతాల నుంచి మొత్తం రూ.1.5 కోట్లు డిపాజిట్ చేశాడు. ప్రారంభంలో సుమారు రూ.20 లక్షలు లాభంగా చూపించినా, తరువాత మొత్తం డబ్బు కోల్పోయాడు. డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మోసగాళ్లు పలు బెట్టింగ్ వెబ్‌సైట్లకు మళ్లిస్తూ మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. ప్రజలకు పోలీసులు సూచనలు: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Admin
DNB News