DNB News - తెలంగాణ / : కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందని, కార్మికుల శ్రమే దేశ ప్రగతికి పునాది అని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు ఎంబీ నర్సారెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకే ఈ నెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయూ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వద్ద నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో నర్సారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగాన్ని పెంచుతూ, ఉపాధి అవకాశాలను కుదించే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అన్నారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేసి పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ప్రజలపై అదనపు భారాలు మోపేలా రూపొందించిన నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, రైతులకు నష్టం కలిగించే నూతన విత్తన చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రజా వ్యతిరేకమని మండిపడ్డారు. కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం అమలు చేయాలని చూస్తున్న ప్రభుత్వాల దుష్ట ఆలోచనలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇది కార్మికులపై వెట్టి చాకిరిని రుద్దే ప్రయత్నమేనని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గం అంతా ఐక్యంగా నిలబడి పోరాటానికి సిద్ధం కావాలని, సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారానే ప్రభుత్వాల కళ్లుతెరిపించవచ్చని నర్సారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ ఉదయం జరిగే కార్మిక ప్రదర్శనలో ప్రతి కార్మికుడు తప్పకుండా పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం పట్టణ వ్యాప్తంగా కార్మికులు, వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కొలగాని రమేష్, పట్టణ నాయకులు ఎస్. అజయ్ కుమార్, రమాదేవి, గీత, శోభ, లక్ష్మి, వెంకటేశ్వర్లు, రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News