DNB News - తెలంగాణ / : - 7 తులాల బంగారం రికవరీ మదీనగూడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగుల సహాయకుల అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రమేష్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ శివాజీ నగర్‌కు చెందిన జె. దుర్గ (45) అనే మహిళ అదే ఆసుపత్రిలో హౌజ్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తూ, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. గత నెల ఫిబ్రవరి 25న, చందానగర్ అపర్ణ హిల్ పార్క్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఎస్‌ఐసీయూలో ఉండగా, ఆయన గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితురాలు కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో (రాత్రి 8:51 నుండి 8:56 మధ్య) లోపలికి ప్రవేశించి, బ్యాగులో భద్రపరిచిన 3 తులాల గొలుసు, 3 తులాల గాజులు, ఒక తులం చెవి రింగులతో పాటు 3 తులాల వెండి వస్తువులను అపహరించింది. మరుసటి రోజు ఉదయం బాధితుడు తన వస్తువులు పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు, డీఐ రమేష్ నాయుడు నేతృత్వంలో ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితురాలు అనుమానాస్పదంగా గదిలోకి వెళ్లడం, విధి ముగిసిన తర్వాత భద్రతా సిబ్బందికి తన సంచిని చూపించకుండా తనిఖీల నుండి తప్పించుకోవడం కెమెరాలో రికార్డ్ అయ్యింది. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ఆమె నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితురాలి వద్ద నుండి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు మరియు 2.5 తులాల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించి, బాధితులకు న్యాయం చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు, ఆసుపత్రి యాజమాన్యాలకు సూచనలు: ఆసుపత్రులకు వచ్చేటప్పుడు విలువైన ఆభరణాలు, భారీ నగదు వెంట తీసుకురావద్దు. ఆసుపత్రి యాజమాన్యాలు తమ సిబ్బందిపై నిఘా ఉంచాలన్నారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా సంఘటన కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News