DNB News - తెలంగాణ / : భారతీయ సంస్కృతి, సహజీవన స్ఫూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ఫౌండర్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ ఆలీ పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోమాత రక్షణ కేవలం ఒక మతానికో, వర్గానికో పరిమితం కాదని, అది భారతీయ సంస్కృతి, జాతీయత, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా “గాయ్ రక్షక్ దళ్” ఏర్పాటు ద్వారా గోవుల సంరక్షణకు సమగ్ర విధానాలు తీసుకురావాలని సూచించారు. ప్రతి గోశాలకు బీమా సదుపాయం, పశువైద్యులచే ప్రతి 15 రోజులకు వైద్య పరీక్షలు, ప్రత్యేక బీడు భూముల కేటాయింపు వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. “హమ్ గాయ్ భక్షక్ నహీ… గాయ్ రక్షక్ హై” అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గోవధ ఫ్యాక్టరీలకు ముస్లింల పేర్లు పెట్టి సామాజిక విద్వేషాలను కొందరు మతోన్మాదులు రెచ్చగొట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి ఫ్యాక్టరీలను నిర్వహించే వారు తమ పిల్లల పేర్లతోనే వ్యాపారాలు కొనసాగించాలని సూచిస్తూ, సమాజంలో పరస్పర గౌరవం, బాధ్యతా భావం పెరగాలని హితవు పలికారు. మతాల పేర్లతో విభేదాలు సృష్టించడం కన్నా, భారతీయులుగా ఐక్యంగా నిలబడటమే దేశానికి శ్రేయస్కరమని అన్నారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం మహనీయుల పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ జెండా రూపకల్పనలో కృషి చేసిన సూరయ్య త్యాబ్జీ, “జైహింద్” నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన అదిబ్ హసన్ సఫ్రాని, “క్విట్ ఇండియా” నినాదాన్నిచ్చిన యూసుఫ్ మెహర్ ఆలీ, నేతాజీకి విరాళాలు అందించిన అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మార్పాని, వంటి మహనీయుల సేవలు భారత ఐక్యతకు చిరస్మరణీయమని కొనియాడారు. దేశం అనేది కేవలం భూభాగం కాదని, పరస్పర గౌరవం, సహజీవనం, త్యాగాలతో నిర్మితమైన మహోన్నత భావన అని సయ్యద్ సాదిక్ ఆలీ పేర్కొన్నారు. గోమాత పరిరక్షణతో పాటు భారతీయుల ఐక్యత కోసం అన్ని వర్గాలు కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో ద్వేషం కన్నా దయ, విభజన కన్నా బంధుత్వం, మతాల మధ్య విభేదాల కన్నా భారతీయత గొప్పదనే సందేశాన్ని ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబించాయి. ఈ విలేకరుల సమావేశంలో సయ్యద్ సాదిక్ అలీ, రాజ్యాంగ పరిరక్షణ వేదిక పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్ నజీరుద్దీన్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షులు మహమ్మద్ ఖలీమ్, సైదా, సుభాని, నిజాంపేట్ కార్యదర్శి మున్నా భాయ్, హబీబ్, ఖమ్మం పట్టణ టూ టౌన్ అధ్యక్షులు అల్లా బకాష్, ఎండి. షఫీ, ఎండి. గులాం నబి, సారధి నగర్ రాజ్యాంగ పరిరక్షణ వేదిక కార్యదర్శి ఎండి గౌస్, ఎండి. ఖుద్రతుల్లా, ఎండి. హాది, ఎండి. కలీము భాయ్, ఎండి. అమ్జద్ పాషా, అల్లాభక్ష్, ఎస్కే. ఆరిఫ్ న్యాయవాది, తౌసీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News