DNB News - తెలంగాణ / : ఖమ్మం : పేదరికం , సామాజిక వివక్షను అధిగమించి వైద్యరంగంలో అరుదైన ఘనత సాధించిన ఖమ్మం నగరం రమణగుట్టకు చెందిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్ జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ కొనియాడారు . 58వ డివిజన్‌కు చెందిన రూత్ జాన్ పాల్ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి , ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ పట్టుదలతో చదువుకుని ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేయడం అభినందనీయమన్నారు . దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి ట్రాన్స్ మహిళగా ఆమె నిలిచారని పేర్కొన్నారు . ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ వివక్షను ఎదుర్కొన్న ఆమె , న్యాయపోరాటం చేస్తూ తన లక్ష్యాన్ని చేరుకోవడం అసాధారణ విజయమన్నారు . ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యురాలిగా సేవలందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు . అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసం , పట్టుదలతో ముందుకు సాగితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రూత్ జాన్ పాల్ నిరూపించారని సజ్జనార్ ప్రశంసించారు . ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని , మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు .
Admin
DNB News